Ponnam Prabhakar: కమ్యూనిస్టుల మద్దతు కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • కరీంనగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరిన పొన్నం
  • ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన కాంగ్రెస్
  • ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని కోరుతున్న సీపీఐ
Ponnam Prabhakar seeks support of Communists

కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీకి సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని విన్నవించారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్ లో ఉంచింది. ఈ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించగా... ఆ పార్టీ తరపున కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎంపీ సీటును కేటాయించాలని కాంగ్రెస్ ను సీపీఐ కోరుతోంది. వరంగల్, కరీంనగర్ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఇవ్వాలని అడుగుతోంది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పొన్నం ట్వీట్ పై కమ్యూనిస్టులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News